Vishal Soni :లోన్ ఎగవేతకు కిడ్నాప్ డ్రామా.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్
తీసుకున్న రుణం ఎగ్గొట్టేందుకు బీజేపీ నేత కుమారుడు ఏకంగా తాను చనిపోయినట్లు డ్రామా ఆడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ నేత మహేశ్ సోనీ కుమారుడు విశాల్ సోనీని మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల రాజ్‌గఢ్‌లోని కాలిసింధ్ నదిలో ఓ వ్యక్తి మునిగిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రెస్క్యూ బృందాలు పది రోజులు గాలించగా నదిలో ఒక కారు బయటపడింది. ఆ కారు నంబర్‌ను బట్టి అది విశాల్ సోనీదని పోలీసులు గుర్తించారు. అయితే ఎంత వెతికినా మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. లోతుగా దర్యాప్తు చేయగా విశాల్ చనిపోలేదని, మహారాష్ట్రలో దాక్కున్నాడని తేలింది.
అతడి ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులు మహారాష్ట్ర పోలీసుల సాయంతో విశాల్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.1.40 కోట్ల రుణం ఎగ్గొట్టేందుకు ఈ డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు విశాల్ కిడ్నాప్ డ్రామా కూడా ఆడినట్లు విచారణలో వెల్లడైంది. ఫర్దాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.