Komatireddy: ఒకేరోజు అమిత్‌షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ..
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ ఇప్పుడు కాక రేపుతోంది.;
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ ఇప్పుడు కాక రేపుతోంది. ఇద్దరూ ఒకే రోజు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడం, అన్నదమ్ములిద్దరికీ.. అమిత్‌షా ఒకేసారి సమయం ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరూ వేర్వేరుగా అమిత్‌షాను కలిశారు. రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగతంగా కలిస్తే... వెంకటరెడ్డి మాత్రం రాష్ట్రంలో వరద సాయంపై అమిత్‌షాను కలిశారు.
హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం.. కోమటిరెడ్డి బ్రదర్స్ వేర్వేరుగా మాట్లాడారు. ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఆ రోజు తెలంగాణకు అమిత్‌షా వస్తారని.. బహిరంగ సభ పెట్టి బీజేపీలో చేరుతానన్నారు.ఈ నెల 8న స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను ఇస్తున్నట్లు తెలిపారు. తాను రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఉపఎన్నికల్లో మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇస్తారన్నారు.
రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ చేశారు. లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఖాళీ చేసి.. టీడీపీ వాళ్లను చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో వెంకటరెడ్డి కూడా సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు రాజగోపాల్ రెడ్డి.
ప్రజా సమస్యల కోసం కేంద్ర మంత్రులను కలిస్తే రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. బీజేపీలో వెళ్తున్నట్లు తప్పుడు వార్తలు రాశారని.. పోవాలనుకుంటే బరాబర్ చెప్పిపోతానన్నారాయన. తనకు తెలియకుండా చెరుకు సుధాకర్‌ని రేవంత్ చేర్చుకున్నారంటూ మండిపడ్డారు. దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీ నుండి వెళ్ళి పోవడానికి రేవంత్ కారణమన్నారు. తనను కూడా వెళ్లగొట్టేలా రేవంత్ వ్యవవరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఈ అంశంపై సోనియా, రాహుల్ గాంధీ దగ్గరే తేల్చుకుంటానన్నారు వెంకట్‌రెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్.... కోమటిరెడ్డి సోదరుల్ని అవమానించేలా వ్యవహరించారని మండిపడుతున్నారు కోమటిరెడ్డి వర్గీయులు. రాజగోపాల్‌రెడ్డి నిష్క్రమణతో కాంగ్రెస్‌కు రెండు మూడు నియోజకవర్గాల్లో నష్టం జరుగనుంది. అయితే వెంకట్‌రెడ్డి కూడా వెళ్లిపోతే ఐదారు నియోజకవర్గాలను కాంగ్రెస్ పూర్తిగా పట్టు కోల్పోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.