MS Swaminathan: హరిత విప్లవ పితామహుడికి భారతరత్న
ఐపీఎస్‌ను వదిలేసి.. రైతుల కోసం శాస్త్రవేత్తగా మారిన స్వామినాథన్;
హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్‌ను భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. మరణానంతరం స్వామినాథన్‌కు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఆహార కొరత నుంచి స్వయం సమృద్ది సాధించే దిశగా దేశం తీసుకున్న అనేక నిర్ణయాల్లో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు.
హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త Msస్వామినాథన్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. 98 ఏళ్ల వయసులో స్వామినాథన్ 2023లో మరణించగామరణానంతరం ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చేనూతన వరి వంగడాలు సృష్టించారు. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన ఆయనఅక్కడే మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. తండ్రి వైద్యుడు కావడం వల్లవైద్య పాఠశాలలో చేరిన స్వామినాథన్ 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలనే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి మారిపోయారు. త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో... జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు.1949లో దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి.. సైటోజెనెటిక్స్‌లో పీజీ చేశారు. యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని జెనెటిక్స్ విభాగంలో బంగాళాదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. అడవి జాతుల నుంచి బంగాళాదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో ఆయన విజయం సాధించారు.
స్వామినాథన్ 1950లో కేంబ్రిడ్జ్ వర్శిటీకి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి PHD చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లోదేశానికి తిరిగొచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా స్వామినాథన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధన వల్ల దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.స్వామినాథన్ ఎన్నో పదవులు సమర్ధంగా నిర్వహించారు. 1972 నుంచి 1979 వరకూఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ డైరక్టర్ జనరల్‌గా పనిచేశారు.1979 నుంచి 1980వరకు కేంద్ర వ్యవసాయశాఖ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు.అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరక్టర్ జనరల్‌గా సేవలందించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకుఅధ్యక్షునిగా పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రముఖుల జాబితా "టైం20"లోఆయన పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 1971లో.... రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు స్వామినాథన్‌ను వరించింది. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా స్వామినాథన్‌ను వరించింది