Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు పటిష్ట భద్రత

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవటం కోసం సాయుధ బలగాలు

Update: 2024-03-23 00:15 GMT

ఏప్రిల్‌ 19న మొదలై జూన్‌ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో సాగనున్న లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పోలీసు బలగాలకు తోడు 3 లక్షల 40 వేల మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరిస్తోంది. ముఖ్యంగా హింసాత్మక ఘటనలు ఎక్కువగా చోటు చేసుకునే పశ్చిమ బంగాల్‌లో 92 వేల మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరిస్తోంది.

పశ్చిమ బంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉగ్రవాద సమస్య ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్‌లో 63 వేల 500 మంది కేంద్ర భద్రతా బలగాలను ఈసీ మోహరిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో పోలింగ్‌ ఐదు విడతల్లో జరగనుంది. నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 36 వేల CAPF సిబ్బందిని తరలించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సీఈఓలు చేసిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు దశలవారీగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3,400 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని నిర్ణయించినట్లు కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది. ఒక్కో CAPF కంపెనీలో 100 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. మరికొన్ని రోజుల్లో బలగాల తరలింపు పూర్తికానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి.


దశల వారీగా పశ్చిమ బంగాల్‌లో మొత్తం 920 CAPF కంపెనీలను మోహరిస్తారు. జమ్మూకశ్మీర్‌లో 635, ఛత్తీస్‌గఢ్‌లో 360, బిహార్‌లో 295, ఉత్తర్‌ప్రదేశ్‌లో 252, ఆంధ్రప్రదేశ్‌, ఝార్ఖండ్‌, పంజాబ్‌లలో 250 చొప్పున CAPF కంపెనీలను మోహరిస్తున్నారు. గుజరాత్‌, మణిపుర్‌, రాజస్థాన్‌, తమిళనాడులో 200 చొప్పున CAPF కంపెనీలను, ఒడిశాలో 175, అసోం, తెలంగాణలో 160 చొప్పున CAPF కంపెనీలను మోహరిస్తున్నారు. మహారాష్ట్రలో 150, మధ్యప్రదేశ్‌లో 113, త్రిపురలో 100 CAPF కంపెనీలు భద్రత కల్పిస్తాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు- CAPFలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌-CRPF, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌-BSF, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ CISF, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌-!TBP, సశస్త్ర సీమా బల్‌-SSB, నేషనల్‌ సెక్యూరిటీ గార్డు-NSG భాగంగా ఉంటాయి. మొత్తంగా కేంద్ర సాయుధ బలగాల సంఖ్య దాదాపు 10 లక్షల వరకు ఉంటుంది.

పశ్చిమ బంగాల్‌, జమ్మూకశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌లో CAPF బలగాలు ఇప్పటికే తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే నియోజకవర్గాల్లో 2 వేల కంపెనీల మోహరింపు పూర్తైంది. పోలింగ్‌కు సంబంధించిన భద్రతను కేంద్ర సాయుధ పోలీసు బలగాలు చూసుకుంటాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, స్ట్రాంగ్ రూమ్ కేంద్రాల రక్షణ, కౌంటింగ్ సెంటర్ భద్రత మొదలైన ఎన్నికల సంబంధిత విధుల కోసం CAPF సిబ్బందిని మోహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు..

Tags:    

Similar News