Bank Locker : బ్యాంక్ లాకర్ తాళంచెవి పోయిందా? ఆందోళన వద్దు..ఇలా చేస్తే మళ్లీ ఓపెన్ అవుతుంది.

Update: 2026-03-05 08:30 GMT

Bank Locker : నేటి కాలంలో ముఖ్యమైన పత్రాలు, నగలు లేదా విలువైన వస్తువులను భద్రపరుచుకోవడానికి చాలామంది బ్యాంక్ లాకర్లనే నమ్ముకుంటారు. ఇంట్లో కంటే బ్యాంక్ లాకరే అత్యంత సురక్షితమైన ప్రదేశం. అయితే, అనుకోకుండా ఎప్పుడైనా ఆ లాకర్ తాళంచెవి పోతే మాత్రం గుండె ఆగినంత పనవుతుంది. లోపల ఉన్న వస్తువులు ఏమైపోతాయో, మళ్లీ లాకర్ ఎలా ఓపెన్ చేయాలో అని కంగారు పడటం సహజం. కానీ, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, లాకర్ తాళంచెవి పోయినప్పుడు అనుసరించాల్సిన స్పష్టమైన నియమాలు ఉన్నాయి.

సాధారణంగా బ్యాంక్ లాకర్ రెండు తాళంచెవులతోనే ఓపెన్ అవుతుంది. ఒకటి కస్టమర్ దగ్గర ఉంటే, రెండోది (మాస్టర్ కీ) బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే లాకర్ తెరుచుకుంటుంది. కస్టమర్ దగ్గర ఉండే తాళంచెవికి సంబంధించి డూప్లికేట్ కాపీ బ్యాంక్ దగ్గర అస్సలు ఉండదు. కాబట్టి మీ తాళంచెవి పోయిందంటే, వెంటనే మీరు చేయాల్సిన పని.. సంబంధిత బ్యాంక్ శాఖకు వెళ్లి లిఖితపూర్వక సమాచారం అందించడం. ఆలస్యం చేసే కొద్దీ రిస్క్ పెరుగుతుంది కాబట్టి వెంటనే బ్యాంకును సంప్రదించాలి. కొన్ని బ్యాంకులు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా అడుగుతుంటాయి.

మీ ఫిర్యాదు అందిన తర్వాత బ్యాంక్ అధికారులు ఒక నిర్ణీత ప్రక్రియను ప్రారంభిస్తారు. లాకర్ తాళం మార్చడానికి లేదా దానిని పగులగొట్టడానికి ఒక నిపుణుడిని పిలిపిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ మీ సమక్షంలోనే, బ్యాంక్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే, లాకర్ తాళం మార్చడానికి లేదా కొత్త తాళంచెవి తయారు చేయడానికి అయ్యే ఖర్చును కస్టమరే భరించాలి. ఈ ఖర్చు బ్యాంకుని బట్టి సుమారు కొన్ని వేల రూపాయల వరకు ఉండవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి కావడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది.

ఇక్కడ అందరినీ వేధించే ప్రధాన ప్రశ్న.. నా వస్తువులు సురక్షితంగా ఉంటాయా? అని. దీనికి సమాధానం అవును. ఎందుకంటే రెండు తాళంచెవులు లేకుండా ఎవరూ లాకర్‌ను ఓపెన్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా దొంగ తాళంచెవిని సంపాదించినా, బ్యాంక్ అధికారుల పర్యవేక్షణ లేకుండా లాకర్ రూమ్‌లోకి వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి తాళంచెవి పోవడం వల్ల కాస్త ఖర్చు, సమయం వృధా అవుతాయి తప్ప, మీ విలువైన వస్తువుల భద్రతకు ఎటువంటి ముప్పు ఉండదు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. లాకర్‌కు నామినీని నియమించుకోవడం, తాళంచెవిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవడం మంచిది.

Tags:    

Similar News