Maharastra : మహారాష్ట్రలో బీజేపీకి షాక్- 'ఇండియా' కూటమికి జై

ఉద్ధవ్​, శరద్​ పక్షానే ప్రజలు!;

Update: 2024-06-05 01:45 GMT

మహారాష్ట్రలో ఇండియా కూటమి హవా చూపించింది. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, ఎన్​సీపీ శరద్‌ పవార్‌ వర్గాలు సత్తా చాటాయి. ఆ రాష్ట్రంలో శివసేన, ఎన్​సీపీ పార్టీలు చీలినా ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌ వైపు కాకుండా ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌ పవార్‌వైపే ఓటర్లు మెుగ్గు చూపారు. గత ఎన్నికల్లో 49 స్థానాలకు 41 చోట్ల ఎన్​డీఏ కూటమి జయకేతనం ఎగురవేసింది. కానీ ఈసారి అనుహ్యంగా బీజేపీ తడబడింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా బీజేపీ కూటమికి భంగపాటు ఎదురైంది. గత రెండు ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి డబుల్‌ డిజిట్‌ను అందుకుంది.

అటు ఇండియా కూటమి భాగమైన శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం అంచనాలకు మించి రాణించింది. సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన వర్గానికి అక్కడి ఓటర్లు షాకిచ్చారు. శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. 2022 జూన్‌లో ఏక్‌నాథ్‌ శిందే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేయడం వల్ల శివసేనలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. బీజేపీతో కలిసి శిందే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు తమ పక్షానే ఉన్నారని శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ఈ విజయం ద్వారా నిరూపించుకుంది.

మరోవైపు బాబాయి శరద్‌ పవార్‌ను కాదని వెళ్లి బీజేపీతో జట్టుకట్టిన అజిత్‌ పవార్‌కు ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. గత రెండు ఎన్నికల్లో పార్టీ చీలక ముందు నాలుగు స్థానాల్లో ఎన్​సీపీ గెలిచింది. ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్ కాదని అజిత్‌ పవార్‌ గతేడాది బీజేపీ- శిందే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరడం వల్ల ఎన్​సీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ- శిందే సర్కారుకు మద్దతు పలికిన అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అటు అజిత్‌ పవార్‌దే అసలైన ఎన్​సీపీ అంటూ ఈసీ ప్రకటించడం వల్ల శరద్‌ పవార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఎన్నికల్లో మాత్రం అజిత్‌ వర్గానికి ప్రజలు మొండి చెయ్యి చూపారు. శరద్‌ పవార్‌కే తమ మద్దతును తెలియజేశారు. 

Tags:    

Similar News