Maharashtra: ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు..
రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్..
రంజాన్ ప్రారంభ వేళ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ భారీ షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్లకు ముగింపు పలికింది. ముస్లింలకు కేటాయించే 5 శాతం కోటాను పూర్తిగా రద్దు చేసింది. పాత సర్క్యులర్లు, ఆదేశాలన్నింటినీ రద్దు చేసింది.
విద్యలో ముస్లిం సమాజానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఈ రిజర్వేషన్ ఆర్డినెన్స్ 2014 నుంచి అమలులోకి వచ్చింది. కానీ చట్టం లేకపోవడం, కోర్టు స్టేలు కారణంగా సంవత్సరాలుగా అనిశ్చితిలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దానిని పూర్తిగా అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ముస్లిం విద్యార్థులకు కళాశాలల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావు. అలాగే కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ కావు.
ప్రభుత్వ నిర్ణయంపై AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ తీవ్రంగా స్పందించారు. ‘‘రంజాన్ కానుకగా ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం విద్యా రిజర్వేషన్లను రద్దు చేసింది. ముస్లింలలో అత్యధిక డ్రాపౌట్ రేటు ఉందని హైకోర్టు అంగీకరించింది. అయినప్పటికీ మన అబ్బాయిలు, అమ్మాయిలు డ్రాప్ అవుట్ చేయవద్దని మేము చెబుతాము. భారతదేశం చదువుకుంటే.. భారతదేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకురాలు, ప్రొఫెసర్ వర్ష ఏక్‌నాథ్ గైక్వాడ్ మండిపడ్డారు. ఇది ముస్లిం సమాజానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల హక్కులను ఎందుకు తొలగిస్తోంది? అని ఆమె ప్రశ్నించారు.
డిప్యూటీ సెక్రటరీ బదిలీ
ఇక మైనారిటీ వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్ కూడా బదిలీ అయ్యారు. జనవరి 28-ఫిబ్రవరి 2, 2026 మధ్య రికార్డు సమయంలో 75కి పైగా విద్యాసంస్థలకు మైనారిటీ హోదా మంజూరు చేయబడిందని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత అనేక ఫైళ్లలో డిజిటల్ సంతకాలు నమోదు చేయబడ్డాయనే అనుమానాలు కూడా తలెత్తాయి. రాష్ట్ర సంతాప కాలంలో ఈ వేగవంతమైన ఆమోదాలు ఎలా జరిగాయనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొత్తం 75 ఆమోదాలను నిలిపివేసి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.