MSRTC: కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపివేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్ర బస్సుపై దాడి జరిగిన నేపథ్యంలో;
కర్ణాటకలో మహారాష్ట్ర బస్సుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. బెంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న బస్సుపై శుక్రవారం రాత్రి చిత్రదుర్గ ప్రాంతంలో కన్నడ అనుకూల మద్దతుదారులు దాడి చేశారు. అంతేకాదు, డ్రైవర్ భాస్కర్ జాధవ్ ముఖానికి నల్లరంగు పూయడంతోపాటు ఆయనపై దాడి చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయనంత వరకు ఆ రాష్ట్రానికి బస్సులు నడిపేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.
స్వాతంత్ర్యానికి పూర్వం బొంబాయి రాష్ట్రంలో ఉన్న బెల్గాం ప్రాంతాన్ని 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కర్ణాటక రాష్ట్రంలో కలిపారు. కర్ణాటక ప్రభుత్వం బెల్గాం పేరును బెలగావిగా మార్చింది. అప్పటినుంచి కూడా తమ భూభాగం తమకే కావాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తుంది. అయితే బెలగావిని తిరిగి ఇచ్చేందుకు కర్ణాటక సిద్ధంగా లేదు. దీంతో ఈ ప్రాంతం కోసం రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తరుచు భాషా, ప్రాంత పరమైన ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మళనంలో ప్రధాని మోడీ కీలకోపన్యాసం చేస్తూ భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని,..భాషా వైవిధ్యం మన ఐక్యతకు అత్యంత ప్రాథమిక ఆధారమని చెప్పిన రోజు వ్యవధిలోనే ఆయా రాష్ట్రాల మధ్య భాషపరమైన దాడులు చోటుచేసుకోవడం విచారకరం.