Maharastra: హస్తం పార్టీలోనూ మహా విస్పోటనం తప్పదా..?

Update: 2023-07-05 02:45 GMT

శివసేన చీలిపోయింది. ఎన్సీపీ విచ్ఛిన్నమైంది. నెక్స్ట్ మిగిలింది కాంగ్రెస్సేనా త్వరలో మహారాష్ట్ర హస్తం పార్టీలోనూ మహా విస్పోటనం తప్పదా అంటే అవుననే అంటున్నారు అక్కడి కమలం పార్టీ నేతలు. అనేక మలుపులు తిరుగుతూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న ఎన్సీపీలో చీలికలు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.ఇపుడు మహా వికాస్‌ అఘాడీలో విచ్ఛిన్నం కాకుండా మిగిలిన ఏకైక కాంగ్రెస్‌ పార్టీలోనూ చీలిక వార్తలు గుప్పుమంటున్నాయి.కాంగ్రెస్‌లోని కీలక నేతలు కొందరు బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నట్లు కమలం నేతలు బాంబు పేల్చారు.

ఏడాది కిత్రం శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది.తర్వాత నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ మద్దతుతో షిండే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఏక్‌నాథ్‌ షిండే సీఎం పగ్గాలు చేపట్టగా బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎం అయ్యారు.శరద్‌ పవార్‌పై తిరుగుబాటు చేసిన ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అధికార కూటమిలోకి చేరిపోయారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.శరద్ వర్సెస్ అజిత్ వార్ కొనసాగుతుండగానే మంత్రి సుధీర్‌ ముంగటివర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలతో పాటు,ఇతర పార్టీల నేతలు కూడా బయటకి వచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఏ క్షణంలోనైనా వారు బయటకి రావొచ్చని మంత్రి చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.

మరోవైపు మహారాష్ట్రలోని తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు.ఎన్సీపీ చీలిక, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణం తదితర అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని మహావికాస్‌ అఘాడీలోనే కొనసాగుతామని అంటున్నారు.అయితే హస్తం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా తమ పార్టీ నేతలను కాపాడుకునేందుకే ఈ భేటీ జరిగిందని మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News