Landslide : జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..
జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన అర్థ్‌కువారీ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. తొలుత తొమ్మిది మంది మరణించినట్లు ప్రకటించినప్పటికీ, సహాయక చర్యలు కొనసాగిన కొద్దీ మృతుల సంఖ్య 30కి పెరిగింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్లే రెండు మార్గాలను అధికారులు తక్షణమే మూసివేశారు.
కాగా ఈ ఘటన పై స్పందించిన శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు యాత్రికులు ప్రస్తుతానికి తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే యాత్రకు రావాలని భక్తులకు సూచించింది. సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు బోర్డు అధికారులు తెలియజేశారు.
ఈ దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్‌లో మాట్లాడి, సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. జమ్మూకశ్మీర్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు.