ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పొందిన ఆయన.. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. 1985 వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆయన కరెన్సీపై సంతకాలు చేసిన ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 2004లో అధికారంలోకి రావడంతో సోనియా ప్రధాని అవుతారని వార్తలు వచ్చాయి. విదేశీయురాలనే కారణంతో సుష్మా స్వరాజ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ తదితర సీనియర్ నేతలు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో సోనియా అనూహ్యంగా మన్మోహన్‌కు ప్రధాని పగ్గాలు అప్పగించారు. 2009లో రెండోసారి కూడా ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం కాకుండా సింగ్‌కే అవకాశం ఇచ్చారు. 2014లో ఓడినా ఆయన్ను ఎవరూ నిందించలేదు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.