IND-PAK : బాలాకోట్, సిందూర్ స్ట్రైక్స్ మధ్య ఎన్నో పోలికలు
National News, latest Telugu News, TV5 News;
ఉగ్రవాదం రెచ్చగొడుతున్న పాక్ కు ఎయిర్ స్ట్రైక్స్ తోనే భారత్ బదులిస్తోంది. బాలాకోట్ దాడి, ఆపరేషన్ సిందూర్‌ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అయితే.. వీటిని దాయాది పాకిస్థాన్ పసిగట్టడంలో విఫలమైంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనకబడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటిలానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఆయన దిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌పంఖ్తుంఖ్వాలోని ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా.. ప్రధాని మోదీ దిల్లీలో ఓ మీడియా బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం గురించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళనా లేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా ముగించాయి.