Maoist Party : సానుకూల వాతావరణం కల్పిస్తే .. ప్రభుత్వాలతో చర్చలకు సిద్దం

Update: 2025-04-02 12:15 GMT

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పిస్తే శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలీ), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యకాండలను, నరసంహారాన్ని (జీనోసైడ్) ను నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే తాము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామని తెలిపారు. మావోయిస్టుల ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకరావాలని శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు, విద్యార్థి యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు తదితరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని అభయ్ పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News