MAVOIST: దద్దరిల్లిన దండకారణ్యం.. సుప్రీం కమాండర్ కేశవరావు మృతి
చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. అగ్ర నేత నంబాల కేశవరావుపై కోటీన్నర రివార్డు;
ఆపరేషన్ కగార్ దూకుడు పెరిగింది. దండకారణ్యంలో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. చత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మరణించారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన మావో నాయకుడిని భద్రతా దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి.
ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలలో నక్సలైట్లకు.. జవాన్ల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. నారాయణపూర్ జిల్లా మాధ్‌లో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపారు. వెంటనే స్పందించిన డీఆర్జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతులలో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రెండు దశబ్దాల కిందట అలిపిరిలో జరిగిన బాంబుదాడిలో ప్రధాన సూత్రధారిగా నంబాల ఉన్నారు. ఆయన మీద రూ. 1.5 కోట్ల భారీ రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా పలుమార్లు చాకచక్యంగా తప్పించుకున్న నంబాల తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీల వినియోగంలోనూ నంబాల నిపుణుడు. ఇటీవల జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడుల సూత్రధారి, మావోయిస్టు చలపతి చనిపోయారు. దీంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్‌కౌంటర్‌లో కోబ్రా కమాండోలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టుల కంపెనీ-7 యూనిట్‌ను టార్గెట్ చేశాయి. ఈ ఆపరేషన్‌లో దాదాపు 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలంగాణ నిఘా వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో బసవరాజ్, మధు మావోయిస్టు ప్రచురణ జంగ్‌తో సంబంధం ఉన్న నవీన్ ఉన్నట్లు తెలుస్తోంది. అబుడ్ మడ్ నక్సల్ ఫ్రంట్‌లో ప్రధాన ఆపరేషన్ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి, ప్రతి ప్రాంతాన్ని జలెల్లడ పట్టాయి బలగాలు. దాదాపు వారం రోజులు శ్రమించిన అనంతరం బలగాలు కర్రెగుట్ట ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడ జాతీయ పతకాన్ని ఎగురవేసి, ఆ ప్రాంతానికి స్వేచ్ఛ లభించిందని ప్రకటించారు.
అద్భుత విజయం: ప్రధాని మోదీ
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘‘మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని కేంద్రహోం మంత్రి అమిత్ షా చేసిన పోస్టును మోదీ రీపోస్టు చేశారు.
అమిత్ షా అభినందన
‘‘నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు. ప్రధాన పురోగతికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను అభినందిస్తున్నట్లు షా తెలిపారు.