Bank Penalty : మినిమం బ్యాలెన్స్ లేదని బాదేస్తున్నారు..మూడేళ్లలో రూ.8,000 కోట్లు వసూలు చేసిన బ్యాంకులు.
Bank Penalty : బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ లేకపోతే బ్యాంకులు బాదే పెనాల్టీల గురించి పార్లమెంటులో కీలక చర్చ జరిగింది. సామాన్యుల నుంచి సేకరిస్తున్న ఈ భారీ చార్జీలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో పూర్తి వివరాలను వెల్లడించారు. ఎంపీలు సురేష్ కుమార్ షెట్కర్, సౌగత్ రే అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, పెనాల్టీల రూపంలో బ్యాంకుల ఖజానాకు ఎంత వచ్చిందో లెక్కలతో సహా వివరించారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23 నుంచి 2024-25 వరకు) ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదన్న కారణంతో ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.8,092.83 కోట్లు వసూలు చేశాయి. సేవింగ్స్, కరెంట్ అకౌంట్ల హోల్డర్ల నుంచి ఈ మొత్తం సేకరించారు. అయితే, బ్యాంకుల మొత్తం ఆదాయంతో పోలిస్తే ఈ పెనాల్టీల వాటా కేవలం 0.23% మాత్రమేనని, ఇది కేవలం బ్యాంకింగ్ సేవలు అందించడానికి అయ్యే ఖర్చును భర్తీ చేయడానికే తప్ప లాభాల కోసం కాదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
జన ధన్ ఖాతాదారులకు టెన్షన్ లేదు
కనీస నిల్వ నిబంధనల నుంచి దేశంలోని సుమారు 72 కోట్ల మందికి ఉపశమనం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రధానమంత్రి జన ధన్ యోజన (PMJDY) కింద తెరిచిన ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. వీటిపై బ్యాంకులు ఎలాంటి పెనాల్టీలు విధించవు. పేదలు, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను ఉచితంగా అందించడమే ఈ పథకాల ఉద్దేశమని మంత్రి వివరించారు.
బ్యాంకుల మర్జీ.. పెనాల్టీల రద్దు
చాలా ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్ ఫ్రెండ్లీగా మారే క్రమంలో స్వచ్ఛందంగా పెనాల్టీలను రద్దు చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ మార్చి 2020లోనే ఈ చార్జీలను ఎత్తివేసింది. తాజా సమాచారం ప్రకారం, మరో 9 ప్రభుత్వ బ్యాంకులు 2025 నాటికి ఈ పెనాల్టీలను పూర్తిగా రద్దు చేశాయి. మిగిలిన రెండు బ్యాంకులు కూడా చార్జీలను భారీగా తగ్గించాయి. అయితే, కట్ అయిన పెనాల్టీలను తిరిగి ఖాతాదారులకు రీ-క్రెడిట్ చేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అది పూర్తిగా బ్యాంక్ బోర్డుల నిర్ణయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
పెనాల్టీ వేయడానికి ముందు వార్నింగ్ తప్పనిసరి
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఖాతాలో కనీస నిల్వ తగ్గిన వెంటనే బ్యాంకులు పెనాల్టీ వేయకూడదు. ముందుగా కస్టమర్‌కు ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా లెటర్ ద్వారా సమాచారం అందించాలి. ఖాతాలో డబ్బులు వేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. ఆ గడువు ముగిసిన తర్వాతే పెనాల్టీ వసూలు చేయాలి. అలాగే ఈ చార్జీలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల నుంచి ఎటువంటి సాధారణ ఆదేశాలు రాలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.