Miss Universe India 2025: ‘మిస్ యూనివర్స్ ఇండియా’గా మణిక విశ్వకర్మ!
మిస్ యూనివర్స్ పోటీలలో భారత్‌కు మణిక ప్రాతినిధ్యం;
‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2025 కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. ఆగస్టు 18న జైపుర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో మణిక విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విన్నర్ రియా సింఘా కొత్త విజేత మణికకు కిరీటాన్ని అలంకరించారు. వచ్చే నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో మణిక భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా విజేత మణికకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా.. హర్యానాకు చెందిన మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇక హరియాణాకు చెందిన అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ‘నా ప్రయాణం గంగానగర్ నగరం నుంచి ప్రారంభమైంది. నేను ఢిల్లీకి వచ్చి పోటీకి సిద్ధమయ్యాను. నాకు సహాయం చేసి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ అందాల పోటీ ఒక ప్రత్యేక ప్రపంచం. ఇక్కడ మనం భిన్నమైన వ్యక్తిత్వాన్ని, పాత్రను ప్రదర్శిస్తాం. ఈ ప్రదర్శనకు నాకు జీవితాంతం గుర్తుంటుంది’ అని మణిక విశ్వకర్మ చెప్పారు.