ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఎలాంటి బ్రేక్ లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా నిలిచారు. గతంలో ఈ రికార్డు ఇందిరాగాంధీ పేరిట ఉంది. ఇవాళ్టితో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4,078 రోజులు అవుతుంది. దీంతో దేశాన్ని బ్రేక్ లేకుండా ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా నిలిచారు. దివంగత ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు ప్రధానిగా ఉన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సైతం అత్యధిక కాలం పాలించారు. వరసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూ, మోదీలకు దక్కుతుంది. 2014, మే 26న నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరేశారు. అలాగే స్వాతంత్య్రం తర్వాత జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర వ్యక్తిగా మోదీ రికార్డుకెక్కారు.
సీఎంగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. 2001లో గుజరాత్ సీఎం అయిన ఆయన 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అప్పటినుంచి ప్రధానిగా ఉన్నారు. 2002, 2007, 2012లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014, 2019, 2024లో ప్రధానిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.