Centres Bills: నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు.. నేడు పార్లమెంట్‌ ముందుకు బిల్లు

నేడు పార్లమెంట్‌ ముందుకు బిల్లు;

Update: 2025-08-20 03:15 GMT

పార్లమెంట్‌ ముందుకు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి. నేరం చేస్తే ప్రధానమంత్రైనా, ముఖ్యమంత్రైనా తొలగించే ప్రతిపాదిత బిల్లు బుధవారం పార్లమెంట్‌ ముందుకు రానుంది. తీవ్రమైన ఆరోపణలపై అరెస్టైన వెంటనే పదవులకు ఉద్వాసన చెప్పాలి. లేకుంటే ఈసారి ఆటోమేటిక్‌గా తొలగింపబడే బిల్లును కేంద్రం తీసుకొస్తుంది.

ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు అరెస్టు చేయబడి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంచబడితే 31వ తేదీలోపు రాజీనామా చేయాలి లేదా స్వయంగా పదవి పోయేలా బిల్లులో చేర్చారు.

ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులు తీసుకొస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు 2025, రాజ్యాంగ (నూట ముప్పైవ సవరణ) బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2025 ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే పరిపాలించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కూడా రాజీనామా చేయలేదు. 6 నెలల పాటు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించారు. తాజా బిల్లుతో అరెస్టైన నెల రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే తొలగింపబడతారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై చర్చించేందుకు బుధవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం అవుతున్నారు. దీనిపై నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే ఆయా అంశాలపై ఇండియా కూటమి యుద్ధం చేస్తోంది. తాజా బిల్లుపై ఎలా స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News