Washing Machine : వాషింగ్ మెషీన్ ఆరోపణలపై మోదీ రియాక్షన్ ఇదే

Update: 2024-04-29 09:58 GMT

బీజేపీతో చేతులు కలిపితే నేతలపై ఉన్న కేసులు తొలగిపోతాయని, ఆ పార్టీ ‘వాషింగ్ మెషీన్’ అని వస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. బీజేపీలో చేరిన 25 మందిలో 23 మందిపై దర్యాప్తు నిలిచిపోయిందన్న ఓ మీడియా కథనంపై స్పందిస్తూ.. ఒక్క కేసు దర్యాప్తు కూడా ఆగలేదన్నారు. ‘కోర్టులు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. అయినా ఇలాంటి కేసులు కేవలం 3శాతమే ఉన్నాయి. వాటి విషయం ఏజెన్సీలు, కోర్టులు చూసుకుంటాయి’ అని తెలిపారు.

అవినీతి ఈరోజుల్లో సర్వసాధారణంగా పరిగణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు ప్రధాని మోదీ. ‘ఒకప్పుడు ఆరోపణలే దేశాన్ని కుదిపేసేవి. కానీ ఇప్పుడు నేరం రుజువై శిక్ష అనుభవించినా కొందరు చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులు ఇస్తున్నారు. అది అవినీతిని గొప్పగా చెప్పుకుంటున్నట్లు కాదా? అవినీతిని సర్వసాధారణంగా పరిగణించొద్దు. అలా చేస్తే దేశానికి ఎంతో నష్టం. ఇది కేవలం బీజేపీ vs ప్రతిపక్షాలు కాదు’ అని పేర్కొన్నారు.

దేశంలో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్స్ ఏర్పాటు చేసి కరెంటు బిల్లులు సున్నా చేయడమే తన లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ. ‘అందరి ఇళ్లకు కరెంటు బిల్లు సున్నా కావాలి. మిగులు విద్యుత్‌తో ఆదాయం రావాలి. ఈవీల హవా రానున్న నేపథ్యంలో విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించాలి. సోలార్ కనెక్షన్లు వస్తే ఈవీల ఛార్జింగ్ సులభమవుతుంది. పెట్రోల్, డీజిల్ కోసం నెలకు అయ్యే రూ.1000-2000 ఖర్చు కూడా ఉండదు’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News