మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) తర్వాత బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ (Nayaab Singh Saini) హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్, అతని క్యాబినెట్ మొత్తం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
హర్యానాలో అధికార బీజేపీ, జననాయక్ జనతా పార్టీ (JJP) సంకీర్ణంలో సంభావ్య చీలికలకు సంబంధించి, ముఖ్యంగా రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లకు సంబంధించి ప్రబలమైన ఊహాగానాలతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అవుట్‌గోయింగ్ క్యాబినెట్‌లో ఖట్టర్‌తో సహా 14 మంది మంత్రులు, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని JJP నుండి ముగ్గురు సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి రాజీనామాలు చేశారు. ఇదేరోజు సాయంత్రం గవర్నర్ నివాసంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.
నయాబ్ సింగ్ సైనీ ఎవరు?
నయాబ్ సింగ్ సైనీ, 54, కురుక్షేత్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, OBC కమ్యూనిటీ సభ్యుడు. గతేడాది అక్టోబర్‌లో బీజేపీ హర్యానా యూనిట్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అతను 1996లో బీజేపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. హర్యానా బీజేపీ సంస్థాగత నిర్మాణంతో ప్రారంభించి, క్రమంగా ఎదిగాడు. 2002లో అంబాలాలో బీజేపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సైనీ.. ఆ తర్వాత 2005లో అంబాలాలో జిల్లా అధ్యక్షుడయ్యారు.
ఆయన 2014లో నారాయణగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2016లో హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో, సైనీ కురుక్షేత్ర నియోజకవర్గం నుండి విజయం సాధించారు. కాంగ్రెస్ నుండి తన సమీప ప్రత్యర్థిని 3.83 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. మనోహర్ లాల్ ఖట్టర్‌కు విశ్వసనీయ మిత్రుడిగా పేరుగాంచిన సైనీ 2014లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి హర్యానా రాజకీయాల్లో స్థిరమైన ఉనికిని కలిగి ఉన్నాడు. అతను ఆ రోజుల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో సభ్యుడు కూడా.