Nirmala Sitharaman: సామాజిక న్యాయమే పరమావధిగా కేంద్రంలోని మోదీ సర్కార్
పేదలు, మధ్య తరగతి కోసమే ప్రభుత్వం అన్న ఆర్ధిక మంత్రి;
సామాజిక న్యాయమే పరమావధిగా కేంద్రంలోని మోదీ సర్కార్ పదేళ్లుగా పనిచేసిందని పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కనీస మద్దతుధర ద్వారా రైతుల ఆదాయం క్రమానుగతంగా, తగినవిధంగా పెంచినట్లు తెలిపారు. తమ పదేళ్ల పాలనలో సామాజిక-ఆర్థిక రూపాంతరంతో విజయం సాధించినట్లు వివరించారు. తమ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు అనే నాలుగు కులాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు.
భారత్ కొవిడ్-19 పరిస్థితులను అధిగమించి స్వావలంబన సాధించేందుకు పునాదులు వేసినట్లు ఆమె వివరించారు. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ... సానుకూలంగా రూపాంతరం చెందిందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సంస్థాగత సంస్కరణలు, ప్రజానుకూల పథకాలు, ఉద్యోగావకాశాల కల్పనలో అన్ని కోణాలను కలుపుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ కొత్త బలాన్ని పుంజుకుందని చెప్పారు. 2020-21లో 5.8శాతంగా ఉన్న జీడీపీ 2021-22లో 9.1శాతానికి పురోగమించిందని తెలిపారు. ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ సమీక్షను బట్టి ప్రస్తుతం ఏడాదికి 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ తదుపరి మూడేళ్ల పాటు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీని నమోదు చేస్తుందని.. సీతారామన్ తెలిపారు. 2030 నాటికి ఏడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు. దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడం ద్వారా ఆహారంపై..ప్రజలో నెలకొన్న ఆందోళనను తమ ప్రభుత్వం తొలిగించినట్లు సీతారామన్ వివరించారు.
ప్రజలే కేంద్రంగా, సంఘటిత అభివృద్ధి దిశగా. గత దశాబ్దంలో దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించినట్లు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రికార్డు సమయంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను నిర్మించినట్లు చెప్పారు. 3 వేల ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 15 ఎయిమ్స్‌లు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ కోర్సుల్లో చేరే... మహిళల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా 43శాతం భారత్‌లోనే ఉందని సీతారామన్ వివరించారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశంలో 1.4 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చామని చెప్పారు. పీఎం ముద్ర యోజన కింద 22.5 లక్షల కోట్ల విలువైన 43 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎం కిసాన్ యోజన కింద 11.8 మంది రైతులకు ఆర్థికసాయం అందించామన్నారు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని పేర్కొన్నారు. సమగ్రమైన జీడీపీ, పరిపాలన, అభివృద్ధి, పనితీరును కనబరచడంపైకేంద్రం దృష్టి సారించినట్లు సీతారామన్ తెలిపారు. సమాజంలో వేళ్లూనుకున్న క్రమబద్దమైన అసమానతలను ప్రధాని మోదీ నేతృత్వంలో సరిచేసినట్లు ఆర్థికమంత్రి వివరించారు.
ద్రవ్యోల్బణం నియంత్రణకు అత్యంత చురుకైన చర్యలు దేశంలో ధరలను అదుపులో ఉంచాయని సీతారామన్ చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. ద్రవ్యోల్బణం 4శాతానికే పరిమితం చేయాలనే ఆదేశాల మేరకు రిజర్వుబ్యాంకు రెండు శాతం అటు ఇటులో ధరల కట్టడికి చర్యలు తీసుకుంటోందని వివరించారు. పదేళ్లలో అద్భుతంగా పనిచేసిన భాజపా ప్రభుత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రసంగంలో ఆశాభావం వ్యక్తంచేశారు.