Bihar Assembly : నా వల్లే లాలూ ఎదిగారు.. బీహార్ అసెంబ్లీలో తేజస్వీకి సీఎం నితీష్ కౌంటర్
బీహార్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. అధికార విపక్షాలు పరస్పర విమర్శల్లో, మంగళవారం ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. సీఎం నితీశ్ కుమార్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్షనేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ప్రయత్నించారు. ఆదాయం లేకుండా పద్దను పెంచుతూ పోతుండటంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ ను అబద్దాల పుట్టగా అభివర్ణించారు. తన తండ్రి లాలూ ప్రసాద్ ప్రభుత్వ హయాంనే నిజమైన అభివృద్ధి జరిగిందని, ఈ ప్రభుత్వంలో అన్నీ తప్పుడు లెక్కలే చెబుతున్నారని విమర్శించారు. దీంతో ఆగ్రహించిన నితీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బీహార్లో అభివృద్ధి ఏమీ జరగలేదని,తన హయాంలోనే జరిగిందన్నారు. తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని నితీశ్ వ్యాఖ్యానించారు. గతంలో బీహార్లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? సాయంత్రమైతే ఎవ్వరూ బయటకొచ్చే వాళ్లు కాదు. నీవు (తేజస్వీ) చిన్న పిల్లాడివి. కావాలంటే వెళ్లి ప్రజల్ని అడుగు. మీ నాన్న ఈస్థాయిలో ఉన్నాడంటే అది నా చలవే. లాలూకు ఎందుకు సపోర్టుగా ఉంటున్నారని మీ మనుషులే అడిగారు.. అయినా నేను మద్దతిచ్చా అని నితీశ్ గత స్మృతులను గుర్తుచేశారు.