Bihar Political Crisis : త్వరలో బిహార్‌లో కొత్త సంకీర్ణ ప్రభుత్వం.. ఒంటరైన బీజేపీ..

Bihar Political Crisis : బీహార్‌లో ఏ క్షణమైనా కొత్త సంకీర్ణ ప్రభుత్వం పుట్టుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2022-08-09 08:16 GMT

Bihar Political Crisis : బీహార్‌లో ఏ క్షణమైనా కొత్త సంకీర్ణ ప్రభుత్వం పుట్టుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి, ప్రతిపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు సీఎం నితీష్‌ కుమార్. మరికాసేపట్లో గవర్నర్‌ను కలవబోతున్నారు సీఎం నితీష్‌ కుమార్.

బీజేపీతో పొత్తు వీడుతున్నామని సీఎం నితీష్‌ కుమార్.. గవర్నర్‌కు అధికారికంగా చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పొత్తు వీడుతున్నట్టు చెప్పిన మరుక్షణమే నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది. అయితే, తమకు ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు మద్దతిస్తాయని చెప్పి బలనిరూపణ కోరుతారని చెబుతున్నారు. మరోవైపు, బీజేపీకి చెందిన 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికొచ్చేందుకు రెడీగా ఉన్నట్టు కూడా బీజేపీ సంకేతాలు పంపింది.

జేడీయూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం నితీష్‌ కుమార్‌ సమావేశం పెట్టారు. అటు ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల మహాగట్‌బంధన్‌ కూటమి ఎమ్మెల్యేలు కూడా రబ్రీదేవీ నివాసంలో భేటీ అయ్యారు.

నితీష్‌ కుమార్‌కు మద్దతు తెలుపుతూ ప్రతిపక్ష నేతలు ఓ లేఖపై సంతకాలు కూడా చేశారు. ఈ లేఖను ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు అందజేశారు. మద్దతుపై ఇప్పటికే సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడిన నితీష్ కుమార్.. సాయంత్రం ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News