PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు రూ.6 వేల నుంచి రూ.12 వేలు..పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.

Update: 2025-12-13 06:00 GMT

PM Kisan : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఇటీవల రైతుల మధ్య ఒక ముఖ్యమైన చర్చ నడుస్తోంది. ఈ పథకం కింద ఇస్తున్న వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.12,000కు కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేయనుందా? 2024 డిసెంబర్‌లో పార్లమెంటు స్థాయీ కమిటీ ఒకటి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఏటా రూ.12,000 ఇవ్వాలని సూచించింది. ఈ అంశంపై డిసెంబర్ 12, 2025న రాజ్యసభలో ఎంపీ సమీరుల్ ఇస్లాం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రమణ్ నాథ్ ఠాకూర్ సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు అని ఆయన తేల్చి చెప్పారు. అంటే పీఎం కిసాన్ నిధులను రెట్టింపు చేసేందుకు ఎలాంటి ప్రణాళికా ప్రస్తుతం లేదని స్పష్టమైంది. దీంతో రైతుల మధ్య నెలకొన్న చర్చలు, ఊహాగానాలకు తెరపడింది.

పీఎం కిసాన్ కిస్తులు పొందడానికి కిసాన్ ఐడీ రిజిస్ట్రేషన్ తప్పనిసరా? అని ఎంపీ సమీరుల్ ఇస్లాం మరో ముఖ్యమైన ప్రశ్న కూడా అడిగారు. దీనికి మంత్రి రమణ్ నాథ్ ఠాకూర్ సమాధానం ఇస్తూ, కిసాన్ ఐడీ అనేది ప్రస్తుతం కొత్త రిజిస్ట్రేషన్లకు మాత్రమే అవసరమని తెలిపారు. అది కూడా కిసాన్ రిజిస్ట్రీ సిద్ధం చేసే పని ప్రారంభమైన 14 రాష్ట్రాల్లో మాత్రమే ఇది తప్పనిసరి. ఈ ప్రక్రియ ఇంకా మొదలుకాని రాష్ట్రాల్లోని రైతులు కిసాన్ ఐడీ లేకుండా కూడా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. కిసాన్ ఐడీ కోసం ఇంకా రిజిస్టర్ చేసుకోని రాష్ట్రాల వివరాలను కూడా ఆయన అందించారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చే పథకం. దీన్ని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. సాగు చేయదగిన భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు వాయిదాలలో నేరుగా లబ్ధిదారుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తారు. అయితే ఈ పథకం లబ్ధి కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే అందుతుంది. ఆర్థికంగా స్థిరపడిన కొన్ని వర్గాలను ఈ పథకం నుంచి మినహాయించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 21 కిస్తుల్లో రైతుల ఖాతాల్లోకి రూ.4.09 లక్షల కోట్లు జమ అయ్యాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాలలో ఇది ఒకటిగా నిలిచింది. రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోని ఫార్మర్స్ కార్నర్ లోకి వెళ్లి, బెనిఫిషియరీ లిస్ట్ ఎంచుకుని, రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలు నింపడం ద్వారా తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో సులభంగా చూసుకోవచ్చు.

Tags:    

Similar News