Odisha Student: తనకు తాను నిప్పంటించుకున్న ఒడిశా విద్యార్థిని మృతి..
ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కారణంగా యువతి ఆత్మహత్య..;
ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించింది. ఆమె తనకు తాను నిప్పంటించుకుని తీవ్రమైన కాలిన గాయాలతో ఉండగా జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.
కాలేజ్ ప్రొఫెసర్ నుంచి సుదీర్ఘ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎయిమ్ ప్రకటన ప్రకారం, ఆమెకు వెంటిలేషన్, ఐవీ, యాంటీబయాటిక్స్, కిడ్నీ చికిత్స అందించినా, జూలై 14న ఆమె తన గాయాల కారనంగా మరణించిందని ఆస్పత్రి ధ్రువీకరించింది.
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మాఝి తన విచారాన్ని వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, వైద్య బృందం అన్ని రకాల మద్దతు అందించినప్పటికీ, బాధితురాలిని ప్రాణాలతో కాపాడలేకపోయామని అన్నారు. ఈ కేసులో దోషులందరికి శిక్ష పడుతుందని, దీనిపై తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశానని చెప్పారు. ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుందని వెల్లడించారు.
తనపై హెచ్ఓడీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపాల్ మరియు కళాశాల అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో ఆ విద్యార్థిని తనను తాను నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ కేసులో కాలేజ్ ఫ్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ ను అరెస్ట్ చేశారు. 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీని తరలించారు.