Omicron Variant: ఇలాగే కొనసాగితే రోజుకు 14 లక్షల కోవిడ్ కేసులు: ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరిక..
Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 11 రాష్ట్రాలకు పాకేసింది.;
Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 11 రాష్ట్రాలకు పాకేసింది. డెల్టా రకం కన్నా 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో కూడిన ఈ కొత్త వేరియంట్ కేసులు మన దేశంలో 101 నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒమిక్రాన్, కరోనా విజృంభణ స్థాయిని చూస్తుంటే.. అలాంటి పరిస్థితులు గనక భారత్‌లో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ హెచ్చరించారు.
యూకే మాదిరి పరిస్థితి భారత్‌లో గనక ఏర్పడితే మన జనాభాను బట్టి రోజుకు 14లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే, ఇప్పుడు ఫ్రాన్స్‌లో రోజుకు 65వేల చొప్పున వస్తుండగా.. అక్కడి పరిస్థితితో పోలిస్తే మన జనాభా దృష్ట్యా భారత్‌లో ప్రతిరోజూ 13లక్షల కేసులు నమోదవుతాయంటూ ఉదహరించారు. యూరప్‌లో 80శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ డెల్టా ఉద్ధృతి తగ్గడంలేదన్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడకంతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపింది.
అలాగే నూతన సంవత్సర వేడుకలను కొద్దిమందితోనే జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 20 రోజులుగా మన దేశంలో రోజుకు 10వేలు కన్నా తక్కువ కొవిడ్ కేసులే వస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటంతో మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వీకే పాల్ గుర్తు చేశారు.