Operation Kagar : ముమ్మరంగా ఆపరేషన్ కగార్.. మావోయిస్టులను మట్టుబెట్టడమే లక్ష్యం
దండకారణ్యంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతాత బలగాలకు, మావోయిస్టుల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు గాయాల పాలయినట్లు గా తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలకు చెందిన డీఆర్డీ బలగాలతో పాటు ఎన్టీఎఫ్ బలగాలు ఈ ప్రత్యేక ఆపరేషన్లో పాల్గొన్నాయి. కాగా ఈ కాల్పుల ఘటనను ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.
మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ వర్షాకాలంలో మావోయిస్టులకు చుక్కలు చూపిస్తామంటూ క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతోంది. గతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు వర్షాకాలంలో నిలిపివేసేవారు. పెద్ద ఎత్తున నదులు, వాగులు, వంకలు పొంగడంతో అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో వర్షాకాలం నక్సలైట్లకు అనుకూల వాతావరణంగా భావించవచ్చు. ఐతే ఇటీవల నిజామాబాద్ లో పర్యటించిన కేంద్రహోంమంత్రి అమిత్ షా మావోయిస్టులను వర్షాకాలంలో నిద్రపోనియ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఇంద్రావతి నదికి పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంద్రావతి నేషనల్ పార్కు మావోయిస్టులు మాటు వేస్తారని భద్రతా దళాలు భావించాయి. శుక్రవారం రాత్రి నుంచి అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుండగా.. శనివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఎదురు పడడ్డంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.