Operation Sindhur : ఆపరేషన్ సింధూర్ ఇంకా ఉంది.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు కొనసాగిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్థాన్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "పాకిస్థాన్‌తో మే 10న యుద్ధం ముగిసిందని మీరు అనుకోవచ్చు. కానీ కాదు. అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో, అది చాలా రోజులు కొనసాగింది. ఆ విషయాలన్నీ ఇక్కడ వెల్లడించలేను" అని ద్వివేది తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో భారత్, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది. అత్యంత కచ్చితత్వంతో కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య కొంత కాలం భీకర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతున్నాయి
ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఇంకా ఉన్నారని, సరిహద్దు వెంబడి వారి చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో సాయుధ దళాల సహకారాన్ని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం డ్రోన్‌లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సంస్కరణలు హర్షణీయమని అన్నారు.