Kamala Pujari : సేంద్రియ వ్యవసాయ నిపుణులు కమలా పూజారి కన్నుమూత

సేంద్రియ సేద్యం విస్తృతికి విశేష కృషి;

Update: 2024-07-21 00:45 GMT

సేంద్రియ వ్యవసాయ విధానాలను స్వయంగా పాటిస్తూ, దేశ విదేశాల్లో అవగాహన కల్పించిన ఒడిశాకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత కమలా పూజారి (74) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మూడు రోజుల క్రితం కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన ఆమె.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కమల మృతికి ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝీ, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె అసాధారణ వ్యవసాయవేత్త అని, ఒడిశాలో సేంద్రియ సాగు విస్తృతికి విశేష సేవలందించారని కొనియాడారు. కమలా పూజారి.. కొరాపుట్‌ జిల్లా జయపురం సబ్‌డివిజన్‌లోని పాత్రపుట్‌కు చెందిన పార్జా గిరిజన జాతి మహిళ. ఆమె 100 రకాల దేశీయ వరి వంగడాలను సేకరించి, భద్రపరిచారు. పసుపు, జీలకర్ర పంటలు పండించి గుర్తింపు పొందారు. కాళ్లకు చెప్పుల్లేకుండా పలు గ్రామాలకు వెళ్లి రైతులకు, మహిళలకు సేంద్రియ సేద్యం, సహజ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. ఒడిశా రాష్ట్ర ప్రణాళికా మండలిలో సభ్యురాలిగా పనిచేశారు. 2002లో దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో సేంద్రియ సాగుపై అనుభవాలు పంచుకున్నారు. 2004లో ఒడిశా ప్రభుత్వం నుంచి ఉత్తమ మహిళా రైతు అవార్డు అందుకున్నారు. ఆమె కృషికి కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది.

Tags:    

Similar News