Floods In Manipur: మణిపూర్‌లో భారీ వర్షాలు.. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేత

ప్రభుత్వ.. ప్రైవేట్ సంస్థలకు సెలవులకు ప్రకటించిన గవర్నర్..;

Update: 2024-07-03 05:45 GMT

మణిపూర్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ అనుసూయ ఉయికే ఇవాళ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అటానమస్ బాడీలు, ప్రభుత్వ పరిధిలోని సొసైటీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, స్కూల్స్, కాలేజీలను మూసివేశారు. కాగా, మరోవైపు మణిపూర్ విద్యాశాఖ డైరెక్టరేట్ సైతం రాష్ట్రంలో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా జూలై 3, 4 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అయితే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని పలు నదులు, సరస్సులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను సైతం వరదలు ముంచెత్తాయి. అయితే, మణిపూర్‌ రాష్ట్రంలోని ప్రధాన నదుల నీటి మట్టాలు క్రమంగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో బలహీనమైన కట్టడాల్లో నివాసం ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News