PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2000.

Update: 2025-11-19 05:30 GMT

PM Kisan : దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా 21వ విడత డబ్బులు నేడు విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు తమిళనాడులోని కోయంబత్తూరులో నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ ను ప్రారంభించే సందర్భంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి 2:00 గంటల మధ్య ఈ డబ్బు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈసారి దాదాపు 9 కోట్ల మంది రైతులకు కలిపి రూ.18,000 కోట్లకు పైగా మొత్తం వారి ఖాతాల్లోకి జమ అవుతుంది. ప్రతి అర్హత కలిగిన రైతుకు రూ.2,000 చొప్పున ఈ విడత డబ్బు అందుతుంది.

తగ్గిన లబ్ధిదారుల సంఖ్యకు కారణాలు

గత విడతలతో పోలిస్తే, ఈసారి పీఎం కిసాన్ డబ్బు అందుకునే రైతుల సంఖ్య కొంచెం తగ్గింది. ఆగస్టు మొదటి వారంలో విడుదలైన 20వ విడత డబ్బును 9.71 కోట్ల మంది రైతులు అందుకున్నారు. అంతకుముందు 10వ విడతను 10.07 కోట్ల మంది రైతులు పొందారు. అయితే, 21వ విడత డబ్బు అందుకునే వారి సంఖ్య దాదాపు 9 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అంటే, గత విడత కంటే ఈసారి 50 లక్షలకు పైగా లబ్ధిదారుల సంఖ్య తగ్గనుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ పథకానికి అనర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారిని జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఈకేవైసీ అప్‌డేట్ చేయని రైతులను కూడా ఈ జాబితా నుంచి తీసివేస్తున్నారు. ఈ కారణంగానే ఈసారి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.

పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకోండిలా

ఈ పథకంలో కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే రైతులు ఈ కింద తెలిపిన విధంగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు:

* ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను ఓపెన్ చేయాలి.

* హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే ఫార్మర్స్ కార్నర్ కనిపిస్తుంది.

* అందులో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేష అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* అక్కడ మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసి, మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, ఓటీపీ ద్వారా ముందుకు సాగాలి.

* ఆ తర్వాత మీ పేరు, భూమి వివరాలు, పట్టాదారు పాసుపుస్తకం కాపీ వంటి డాక్యుమెంట్ల వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

* చివరికి సేవ్ బటన్ క్లిక్ చేస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

ఈకేవైసీ చేయండిలా

ఈ పథకంలో ఇదివరకే నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేదంటే డబ్బులు అందవు.

* దగ్గర్లోని CSC సెంటర్ లేదా రైతు సంప్రదింపు కేంద్రానికి వెళ్లి అక్కడ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు.

* పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు.

* అలాగే, పీఎం కిసాన్ మొబైల్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు.

కుటుంబంలో ఒక్కరికే డబ్బు

పీఎం కిసాన్ పథకానికి కొన్ని అర్హత నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక కుటుంబంలో (భార్యాభర్తలు, పిల్లలు) ఒకరి కంటే ఎక్కువ మందికి భూమి యాజమాన్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బు లభిస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత భూమిని కొనుగోలు చేసిన వారికి లేదా తండ్రి జీవించి ఉండగానే కొడుకు తన పేరు మీద భూమిని బదిలీ చేసుకున్న వారికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అందవు.

Tags:    

Similar News