PM Modi: మోడీ ‘సెంచరీ’.. ఇన్‌స్టాలో 100 మిలియన్ ఫాలోవర్స్‌తో వరల్డ్ రికార్డ్..
అత్యధిక ఫాలోవర్లు ఉన్న పొలిటీషియన్ గా రికార్డు
ప్రధాని మోడీ మరోసారి అరుదైన రికార్డ్ సృష్టించారు. డిజిటల్ ప్రపంచంలో ఓ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ ఫాలోవర్లను దాటిన ప్రపంచంలోనే తొలి దేశాధినేతగా రికార్డు సృష్టించారు. 2014లో మెటాకు చెందిన ఈ ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్ ప్రారంభించిన ప్రధాని.. తాజాగా వంద మిలియన్ల ఫాలోవర్స్‌కు చేరుకోవడం విశేషం. అయితే.. ఇన్‌స్టాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 15 మిలియన్‌తో తర్వాతి స్థానంలో ఉన్నారు. బ్రెజిల్, టర్కీ, అర్జెంటీనా అధ్యక్షుల ఫాలోవర్స్‌ను కలిపినా మోడీకి సమానం కాలేకపోయారు. దీంతో ప్రధాని డిజిటల్ రీచ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. దేశీయ రాజకీయాల్లోనూ ఇదే దృశ్యం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ 16.1 మిలియన్ ఫాలోవర్లతో ఉండగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుమారు 12.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సంఖ్యలతో పోలిస్తే మోడీ ఫాలోయింగ్ భారీగా ఉందని చెప్పాలి
సోషల్ మీడియా ప్రభావంతో పాటు గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్‌లోనూ ప్రధాని మోడీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2025 డిసెంబర్‌లో విడుదలైన స్టాటిస్టా (Statista) సర్వే ప్రకారం.. భారత ప్రధానికి 70 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. జపాన్ ప్రధాని సనే తకైచి (Sanae Takaichi) 63 శాతంతో రెండో స్థానంలో ఉండగా, జావియర్ మిలే 60 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. అదే జాబితాలో ట్రంప్ మాత్రం 43 శాతం అప్రూవల్‌తో 11వ స్థానానికి పడిపోయారు. ఇటీవల మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) విడుదల చేసిన తాజా డేటా సైతం ఇదే ధోరణిని చూపించింది. 2026 ఫిబ్రవరి 2 నుంచి 8 మధ్య నిర్వహించిన సర్వేలో మోడీ 67 శాతం అప్రూవల్‌తో మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. చెక్ రిపబ్లిక్ మాజీ ప్రధాని ఆండ్రెజ్ బాబిస్ 59 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. సనయే టకైచి 56 శాతంతో ఐదో స్థానంలో ఉండగా, ట్రంప్ 40 శాతంతో 11వ స్థానంలో నిలిచారు. మొత్తానికి, సోషల్ మీడియా ఫాలోయింగ్ అయినా.. గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ అయినా.. మోడీ టాప్‌లో కొనసాగుతున్నారు.