IVF: మరణాన్ని జయించిన అమ్మతనం
వైద్య చరిత్రలో ఇదో అద్భుతం ఆవిష్కారం... అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైద్యులు.. బిడ్డకు జన్మనిచ్చిన గర్భాశయం లేని మహిళ
మాతృత్వం… ప్రతి మహిళ హృదయంలో నాటుకుపోయే ఒక సహజమైన స్వప్నం. కానీ పుట్టుకతోనే గర్భాశయం లేక జన్మించిన ఒక మహిళకు ఆ స్వప్నం అసాధ్యంగా మారింది. వైద్యులు కూడా ఎన్నాళ్లుగానో సాధ్యమా అనే సందేహంలో ఉన్న చికిత్స… చివరకు ఆశను నిజం చేసింది. యునైటెడ్ కింగ్డమ్లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రేస్ బెల్ అనే మహిళ అరుదైన వైద్య సమస్యతో జన్మించింది. ఆమెకు పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం వల్ల సహజసిద్ధంగా గర్భం దాల్చే అవకాశం లేదు. ఈ పరిస్థితిని వైద్య భాషలో “యూటరైన్ ఏజెనేసిస్” అని పిలుస్తారు. జీవితంలో తల్లిగా మారలేనన్న భావనతో ఎన్నో సంవత్సరాలు గడిపిన గ్రేస్‌కు, ఒక అపరిచిత దాత ఆశాకిరణంగా మారారు. 40 సంవత్సరాల వయసులో మరణించిన ఓ మహిళ అవయవ దానం చేయాలని ముందే నిర్ణయించుకుంది. ఆమె గర్భాశయాన్ని వైద్యులు సేకరించి, గ్రేస్‌కు మార్పిడి చేయాలని నిర్ణయించారు. ఇది సాధారణ శస్త్రచికిత్స కాదు. సుమారు 17 గంటల పాటు కొనసాగిన అత్యంత సంక్లిష్ట ఆపరేషన్ ద్వారా గర్భాశయ మార్పిడి జరిగింది. యూకే వైద్య చరిత్రలో ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయోగాల్లో ఒకటిగా నిలిచింది. శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ అసలైన సవాలు అప్పుడే ప్రారంభమైంది.
మార్పిడి చేసిన గర్భాశయం గ్రేస్ శరీరానికి సరిపడేలా పనిచేయాలి. శరీరం దానిని తిరస్కరించకుండా ఉండాలి. దీని కోసం ప్రత్యేక ఔషధాలు, క్రమమైన పరీక్షలు, వైద్యుల నిరంతర పర్యవేక్షణ అవసరమయ్యాయి. ప్రతి దశలోనూ ప్రమాదం ఉండే అవకాశం ఉంది. గర్భం దాల్చడం మరో కీలక దశ. వైద్యులు ఐవీఎఫ్వి ధానాన్ని ఉపయోగించారు. గ్రేస్ సొంత అండాలను సేకరించి, భర్త వీర్యంతో కలిపి భ్రూణాలను రూపొందించారు. వాటిలో ఆరోగ్యకరమైన భ్రూణాన్ని మార్పిడి చేసిన గర్భాశయంలో అమర్చారు. ప్రతీ క్షణం వైద్యుల నిఘాలో సాగిన ఈ ప్రయాణం ఎంతో ఉద్విగ్నంగా కొనసాగింది.
చివరకు క్రిస్మస్కు ముందు రోజు గ్రేస్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి ప్రాంగణం ఆనందంతో నిండిపోయింది. తల్లిగా మారలేనని భావించిన ఒక మహిళ, ఇప్పుడు తన శిశువును ఒడిలోకి తీసుకుంది. ఆ బిడ్డకు ‘హ్యూగో’ అనే పేరు పెట్టారు. ఈ ఘటన మరణానంతర అవయవ దానం ఎంత విలువైనదో మరోసారి గుర్తుచేసింది. సాధారణంగా అవయవ దానం అంటే ప్రాణాలను కాపాడటమే అనుకుంటాం. కానీ ఈ సంఘటన ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి కూడా అవయవ దానం కారణమవుతుందని నిరూపించింది.