చైనాలోని తియాన్‌జిన్ వేదికగా జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆత్మీయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇదే సదస్సులో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను మోదీ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సదస్సు ప్రారంభంలో మోదీ, పుతిన్‌లు నవ్వుతూ, ఆత్మీయంగా కరచాలనం చేసుకొని, ఆలింగనం చేసుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో అక్కడే ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను మోదీ పూర్తిగా విస్మరించారు. పుతిన్‌తో మాట్లాడుకుంటూ మోదీ వెళ్లిపోవడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. మరో సందర్భంలో షరీఫ్ పుతిన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా, ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి, 'ఆపరేషన్ సిందూర్' వంటి పరిణామాల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మోదీ ఈ విధంగా వ్యవహరించారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాద సమస్యను లేవనెత్తారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఇరు దేశాలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.