PM Ujjwala Yojana : పొగ పొయ్యికి గుడ్‌బై.. 10 కోట్ల కనెక్షన్ల మైలురాయి దాటిన పీఎం ఉజ్వల యోజన.

Update: 2025-10-25 05:45 GMT

 PM Ujjwala Yojana : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాల్లో పీఎం ఉజ్వల యోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలో పరిశుభ్రమైన ఇంధనం, ఇంట్లో స్వచ్ఛమైన వాతావరణం, లింగ సమానత్వం అనే మూడు ముఖ్య ఉద్దేశాలను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2016లో ప్రారంభమైన ఈ ఉజ్వల యోజన కింద, దేశవ్యాప్తంగా పేద ప్రజలకు సబ్సిడీ ధరల్లో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైన ఏడేళ్లలో, ఎల్పీజీ కనెక్షన్ పొందిన ఇళ్ల సంఖ్య ఏకంగా 10 కోట్ల మైలురాయిని దాటింది. ఈ పథకం కారణంగా దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొయ్యికి బదులు ఎల్పీజీని వాడే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది.

పీఎం ఉజ్వల యోజన ద్వారా దేశంలో 95 శాతం ఇళ్లకు ఎల్పీజీ కనెక్షన్లు అందించడం సాధ్యమైంది. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెల పొయ్యికి బదులుగా ఎల్పీజీని ప్రధాన ఇంధనంగా ఉపయోగించే ఇళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మహిళల ఆరోగ్యాన్ని కాపాడటం, దేశంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడం ఈ పథకం వెనుక ఉన్న ముఖ్య లక్ష్యాలు.

భారత్, చైనా, ఇండోనేషియా, నైజీరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా ఇళ్లలో వాయు కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది. వంట కోసం బొగ్గు లేదా కట్టెలను ఉపయోగించడం వల్ల ఇంటి లోపల గాలి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు, కంటి సమస్యలు, స్ట్రోక్ వంటి అనారోగ్యాలు తలెత్తుతాయి. వంటకు ఎల్పీజీని ఉపయోగించడం వల్ల ఇంటి లోపల వాయు కాలుష్యం అదుపులోకి వచ్చి, స్వచ్ఛమైన గాలి ఉండే వాతావరణం ఏర్పడుతుందని అనేక పరిశోధనల ద్వారా స్పష్టమైంది.

కట్టెల పొయ్యి వల్ల విడుదలయ్యే కాలుష్య కారక పదార్థాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పొయ్యిపై వంట చేసినప్పుడు పీఎం 2.5 అనే కాలుష్య కారక పదార్థం గాలిలోకి చేరుతుంది. భారతదేశ వాతావరణంలో ఉండే మొత్తం పీఎం 2.5 కణాల్లో సుమారు 30 శాతం కట్టెల పొయ్యిల ద్వారానే వస్తున్నాయని అంచనా. ఈ పీఎం 2.5 కణాలు ఆరోగ్యానికి చాలా హానికరం. ప్రతి ఇంట్లో ఎల్పీజీని ఉపయోగించడం ద్వారా వాతావరణంలో పీఎం 2.5 కణాలు చేరడం గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల గాలి స్వచ్ఛత పెరుగుతుంది. అనారోగ్యం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 2030 నాటికి స్వచ్ఛమైన ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఐక్యరాజ్యసమితి లక్ష్యాన్ని చేరుకోవడానికి పీఎం ఉజ్వల యోజన వంటి పథకాలు చాలా కీలకమైనవి.

Tags:    

Similar News