జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన బీహార్‌లోని ఆరా జిల్లాలో ఆయన నిర్వహిస్తున్న రోడ్‌షోలో జరిగింది. ప్రజలను పలకరించేందుకు కారులోంచి వంగినప్పుడు, పక్కటెముకల భాగానికి (రిబ్స్) గాయమైనట్లు పార్టీ నాయకులు తెలిపారు. కొందరు ఆయనను ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని కూడా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆయనకు ఎడమ వైపు పక్కటెముకల భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. గాయం కారణంగా ఆయన తీవ్ర నొప్పితో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఆరాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గాయం తీవ్రమైనది కాదని, కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ సంఘటన బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.