PM Modi : మరోసారి రష్యాకు ప్రధాని మోడీ.. నాలుగు నెలల్లోనే రెండోసారి

Update: 2024-10-21 11:45 GMT

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఈనెల 22 నుంచి 23 తేదీల్లో ఆ దేశంలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గోనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సమ్మిట్ లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతోపాటు.. భవిష్యత్ సహకారంకోసం ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు నెలల్లో రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై నెలలో మోదీ రష్యాలో పర్యటించారు. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర తరువాత మాస్కోలో ప్రధాని మోదీ తొలిసారి పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్ – రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో కూడా మోదీ సమావేశం అయ్యారు.

2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్ గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి.

Tags:    

Similar News