ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్‌రాజ్ చేరుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.