Priyanka Gandhi: నేడు వాయనాడ్‌లో ప్రియాంక నామినేషన్
ప్రియాంక నామినేషన్ సందర్భంలో రాహుల్ ఆసక్తికర ట్వీట్;
ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తు్న్న ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నామినేషన్ పత్రాలను ప్రియాంక గాంధీ దాఖలు చేయనున్నారు.
ఇక, ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో కలిసి ఇప్పటికే ఆమె ఢిల్లీ విమానాశ్రయం నుంచి వయనాడ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా హృదయంలో వయనాడ్ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంక కంటే మెరుగైన ప్రజా ప్రతినిధిని ఊహించలేను అని చెప్పుకొచ్చారు. ఇక, ఆమె వయనాడ్ ప్రజల తరఫున పార్లమెంటులో తన గళమెత్తుతారని నాకు నమ్మకం ఉందని ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. కాగా, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆ తర్వాత రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రిజైన్ చేశారు. దీంతో ఈ స్థానంలో బై ఎలక్షన్ వచ్చింది. వయనాడ్ ఉప ఎన్నికకు నవంబర్ 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.