Maharashtra: మహారాష్ట్రలో వర్ష బీభత్సం..
నదులుగా మారిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు;
నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కేరళ తర్వాత, నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే మహారాష్ట్రకు చేరుకున్నాయి. ఆదివారం మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా, పూణే-సోలాపూర్ హైవే జలమయం అయింది. రోడ్లు నదులను తలపించాయి. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీ వర్షాలు ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
రాబోయే మూడు రోజుల్లో ముంబై, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు వ్యాపిస్తాయని IMD తెలిపింది. మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక (బెంగళూరుతో సహా), ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ-మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.