QR Code Scam: రామమందిరం పేరిట క్యూఆర్ కోడ్ స్కాం…
ఆలయానికి విరాళాల పేరిట భక్తులను బురిడీకొట్టిస్తున్న కేటుగాళ్లు;
అయోధ్యలో రామ మందిరానికి మహా సంప్రోక్షణ మహోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆలయం పేరుతో భక్తులను దోచుకునే షాకింగ్ ముఠా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు ఆలయం పేరుతో విరాళాలు ఇవ్వాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది. ఈ సందేశాలకు క్యూఆర్ కోడ్ కూడా ఉంది. స్కాన్ చేసి చెల్లించిన డబ్బు మోసగాళ్లకు చేరుతోందని వీహెచ్‌పీ తెలిపింది.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్నది. అయితే భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకొనేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. భక్తులకు ఫోన్లు చేసి, సోషల్ మీడియా సందేశాలు పంపుతూ.. అయోధ్య ఆలయానికి విరాళాలు ఇవ్వాలంటూ భక్తులను బురిటీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్, సందేశాల ద్వారా డబ్బులు పంపేందుకు వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా క్యూఆర్ కోడ్‌లు పంపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆలయానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, ఫోన్ కాల్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాల్‌ను స్వీకరించిన వారిలో ఒకరు వీహెచ్‌పీ కార్యకర్తలతో నంబర్‌ను పంచుకున్నారు. ఓ వీహెచ్‌పీ కార్యకర్త ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో మోసగాళ్ల వ్యూహాలు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో నిధులు సమీకరించే బాధ్యతను ఆయోధ్య ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఎవరికీ అప్పగించలేదని, ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిందూ మత సంస్థలు సూచిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖతో పాటు ఢిల్లీ, యూపీ పోలీసు శాఖల దృష్టికి తీసుకెళ్లామని వీహెచ్‌పీ తెలిపింది. ఇదే విషయంపై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సల్ పేర్కొన్నారు.
ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. చారిత్రక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఎంతో సంతోషకరమైందని.. ఈ సమయంలో అనేక మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, జనవరి 22న జరిగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోడీ తో సహా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవుతున్న విషయం తెలిసిందే.