లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ రెండు విడతలుగా భారత్ జోడో యాత్రను చేపట్టింది. అయితే ఈసారి రాహుల్.. డోజో యాత్ర గురించి వెల్లడించారు. త్వరలో డోజో యాత్ర అంటూ గురువారం ఒక వీడియోను షేర్ చేశారు. గత రెండేళ్లలో రాహుల్ గాంధీ.. ‘భారత్ జోడో యాత్ర’, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను చేపట్టారు. న్యాయ్ యాత్రను తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వైపు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్లకు సంబంధించిన వీడియోను తాజాగా ఆయన షేర్ చేశారు. అలాగే త్వరలో ‘భారత్ డోజో యాత్ర’ రాబోతోందని వ్యాఖ్యానించారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.‘జోడో యాత్ర సమయంలో మేం వేల కిలోమీటర్లు ప్రయాణించాం. ఆ సమయంలో మా శిబిరాల వద్ద ప్రతిరోజు జివు-జిట్సూ ను ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఫిట్‌గా ఉండేందుకు మేం ప్రారంభించిన యాక్టివిటీ త్వరలోనే అందరికీ చేరువైంది. మేం బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒకచోటకు చేర్చింది. మెడిటేషన్, జివూ-జిట్సూ, అకిడో, అహింసాపద్ధతితో ఘర్షణను పరిష్కరించే పద్ధతులు కలగలిసిన ఆర్ట్‌ను యువతకు పరిచయం చేయడమే లక్ష్యంగా వాటిని నిర్వహించాం. ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించాలని, దయ, సురక్షితమైన సమాజం కోసం కావాల్సిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని రాహుల్ పోస్టు పెట్టారు.