Rahul Gandhi: భారత రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ
సమస్యలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్అగ్రనేత;
రెజ్లింగ్ క్రీడాకారులతో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం భేటీ అయ్యారు. హర్యాణాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో ప్రాక్టీస్‌లో ఉన్న రెజ్లర్లను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బజరంగ్ పునియా తమ సమస్యలను రాహుల్‌కు విన్నవించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ప్రెసిడెంట్‌గా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు నిరసనగా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు తమ అవార్డులను వాపస్ ఇచ్చేశారు. సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. బజరంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్ ఫొగాట్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వారిని కలిసి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. రెజ్లర్ల నిరసన నేపథ్యలో అలర్ట్ అయిన కేంద్రం.. సంజయ్ సింగ్ ప్యానెల్‌ను సస్పెండ్ చేసింది. జాతీయస్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలు ఈ నెలాఖరులో ప్రారంభం అవుతాయని సంజయ్ సింగ్ డిసెంబరు 21న ప్రకటించారని, నియామవళి ప్రకారం ఓ టోర్నీ ప్రారంభ తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటన చేయాల్సి ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వివరించింది. సంజయ్ చేసిన ప్రకటనతో రెజ్లర్లు టోర్నీకి సిద్దమయ్యేందుకు తగినంత సమయం లేకుండా పోయిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు, భారత రెజ్లింగ్ సమాఖ్య పూర్తిగా గత కార్యవర్గం అదుపాజ్ఞల్లోనే పనిచేస్తున్నట్టుందని కేంద్రం పేర్కొంది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా తనకు రెజ్లింగ్‌తో ఏం సంబంధం లేదని, ఈ ఆటకు ఇక సెలవు అని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.