లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీల పనితీరును పర్యవేక్షించే కమిటీ ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీతో పాటు అధిష్టానానికి నివేదిక ఇస్తుంది. ప్రజాప్రయోజనాలకు సంబంధించి ఎన్ని అంశాలను ప్రస్తావించారు. ఎన్ని నోటీసులు ఇచ్చారు. క్వశ్చన్ అవర్ లో ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. జీరో అవర్లో ఎలాంటి అంశాలు, సమస్యలు లేవనెత్తుతున్నారనే దాని ఆధారంగా నివేదిక తయారుచేస్తారు.
సభలో మాట్లాడేందుకు పార్టీ సమయం ఇచ్చినప్పుడు ఎలాంటి సంసిద్ధతతో వెళ్లి మాట్లాడుతున్నారనే అంశాల ఆధారంగా పర్యవేక్షణ కమిటీ ఎంపీల పనితీరును అంచనా వేస్తుంది. అలాగే ఎంపీలకు ర్యాంకులను కేటాయించనున్నారు. లోక్ సభలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 99 మంది ఆ పార్టీ ఎంపీలు గెలుపొందారు. దీంతో ఆపార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. దీంతో రాహుల్ గాంధీని లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడంతో ఆయన ఆ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించడంపై దృష్టిపెట్టారు.
రాహుల్ వచ్చే నెల మొదటివారంలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు కాలిఫోర్నియా, చికాగోలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాహుల్ వాషింగ్టన్ లో కూడా పర్యటించే అవకాశం ఉంది. అమెరికాలోని ప్రవాస భారతీయులతో పాటు యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.