Rahul Gandhi: ట్రంప్‌కు మోదీ తలొగ్గుతారు..రాసి పెట్టుకోవాలన్న రాహుల్‌గాంధీ

యూఎస్‌-భారత్‌ ట్రేడ్‌ డీల్‌పై రాహుల్‌ గాంధీ విమర్శ;

Update: 2025-07-05 06:15 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌ విషయంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్‌ ముందు లొంగిపోతారని వ్యాఖ్యానించారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  గుండెలు బాదుకోవడం తప్ప ఏమీ చేయలేరు. నా మాటలు నమ్మకపోతే రాసిపెట్టుకోండి’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

భారత ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 10 శాతం టారిఫ్‌ విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ భారత్‌ సహా పలు దేశాలపై అదనపు సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్‌ 2న మన దేశంపై ట్రంప్‌ 26 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అదనపు సుంకాలను జులై 9 వరకూ నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ యంత్రాంగం గతంలోనే ప్రకటించింది. అంతలోపు ఆయా దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే, జులై 9 నుంచి అదనపు సుంకాలు వడ్డిస్తారు. అంతలోపే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. ఈ అదనపు 26 శాతం సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్‌ కోరుతోంది.

మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై  ఇరు దేశాలూ తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు చివరి దశకు వచ్చినట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాణిజ్య ఒప్పందంలో ఇరు దేశాలూ వ్యవసాయం, ఆటోమొబైల్స్‌, ఇండస్ట్రియల్‌ గూడ్స్‌, లేబర్‌ ఇంటెన్సివ్‌ ప్రొడక్ట్‌లపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. దేశంలో అధిక ఉపాధి కల్పించే తమ ఎగుమతులపై సుంకాలను గణనీయంగా తగ్గించాలని భారత్ ప్రతిపాదిస్తోంది. ముఖ్యంగా వస్త్రాలు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై అర్థవంతమైన రాయితీల కోసం భారత్‌ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయం, డెయిరీ రంగాల్లోనూ తమ ఉత్పత్తులకు పూర్తిస్థాయి మార్కెట్ ప్రవేశం కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ, దేశంలోని గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత దృష్ట్యా ఈ రెండు కీలక రంగాలను ఒప్పందం పరిధి నుంచి దూరంగా ఉంచాలని భారత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీలోగా.. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి రానుంది. అయితే, రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటేనే వాణిజ్య ఒప్పందాన్ని భారత్ అంగీకరిస్తుందని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News