ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళలోని వయనాడ్ సాధారణ పరిస్థితికి చేరుకోవడంతో అక్కడ పర్యాటకాన్ని పునరుద్ధరించా లని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత నెలలో జరిగిన విషాదం జిల్లాలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రభావితం చేసిందన్నారు.
పర్యాటకంగా ఎంతో అందమైన ప్రదేశంగా విలసిల్లుతున్న వయనాడ్లో ప్రజలు సందర్శించేలా ప్రోత్సహించాలని రాహుల్ చెప్పారు. ఆదివారం నాడు కేరళ కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన
మాట్లాడారు. వయనాడ్లో టూరిజాన్ని తిరిగి అభివృద్ధి చేయడానికి గట్టి చర్యలు అవసరమని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వయనాడు వచ్చేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదన్నారు.
సహాయం, పునరావాసంపై శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు రాహుల్. ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వయనాడ్లో ప్రస్తుత పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు. జులై 30న వయనాడ్లోని మెప్పాడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 400 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు.