Rahul Gandhi : విద్యావ్యవస్థ అర్సెస్సెస్ చేతుల్లోకి వెళితే దేశం నాశనమే : రాహుల్ గాంధీ
విద్యావ్యవస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చేతుల్లోకి వెళితే దేశం నాశనం అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయా పార్టీల సిద్ధాంతాలు, విధానాల విషయంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య స్వల్పతేడాలు ఉండొచ్చని, అయినా విద్యావ్యవస్థ విషయంలో ఎన్నడూ రాజీపడలేదని చెప్పారు. నిరుద్యోగ సమస్య, జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీల అనుబంధ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. వీరికి రాహు ల్ గాంధీ సంఘీభావం తెలిపారు.
"దేశ భవిష్యత్, విద్యా వ్యవస్థను ఒక సంస్థ (ఆరెస్సెస్) నాశనం చేయాలని చూస్తోంది. అలా జరిగితే ఎవరికీ ఉపాధి అవకాశాలు రావు. ఇప్పటికే యూనివ ర్శిటీల వైస్ చాన్సలర్లపై ఆరెస్సెస్ పెత్తనం చేస్తోందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర యూనివర్శిటీల వీసీలను కూడా ఆరెస్సెస్ సిఫారసుతోనే నియమిస్తారని, దీనిని అడ్డుకుని తీరాలని, ఈ విషయాలన్నీ విద్యార్థుల ముందుకు తీసుకెళ్లాలి" అని సూచించారు. అలాగే గతవా రం పార్లమెంట్లో మహాకుంభ్ ప్రస్తావన చేసిన ప్రధాని మోడీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడి వుండే బాగుండేదని రాహుల్ గాంధీ అన్నారు. విద్యా వ్యవసపై కూడా ఒక్క ముక్క మాట్లాడలేదని మండిపడ్డారు. దేశంలోని వనరులన్నింటినీ అదానీ, అంబానీ లకు, సంస్థలన్నింటినీ ఆరెస్సెస్కు అప్పగించడమే వారి మోడల్గా మారిందని విమర్శించారు.