Whip Aadi Srinivas : రాహుల్ హిందువే.. హిందూ సంప్రదాయంలోనే ఫిరోజ్, ఇందిరా వివాహం

Update: 2025-02-19 06:45 GMT

తొలి ప్రధాని నెహ్రూ కశ్మీర్ బ్రాహ్మణ పండిట్ అనీ, ఆయన హిందూ వారసత్వాన్నే రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పార్సీ మతానికి చెందిన వారని, ముస్లింకాదని తేల్చిచెప్పారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీ కులం గురించి బాధ్యత గల కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బరితెగించి మాట్లాడుతున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి కానీ, కులం పేర తప్పుడు ప్రకటనలు చేయరాదని మండిపడ్డారు. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ జహింగీర్ మాండీ (గాంధీ ) 1912 సెప్టెంబరు 12న అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో జొరాస్ట్రియన్ మతానికి (రతన్ టాటా కుటుంబం పాటించే మతం) చెందిన పార్సీ కుటుంబంలో జన్మించారని, తల్లిదండ్రులు పూర్వపు పర్షియా (ఇరాన్) నుంచి భారత దేశానికి వలస వచ్చారని గుర్తు చేశారు. భారతదేశంలో జైన, బౌద్ధ, క్రైస్తవ పేర్లు హిందువుల పేర్లకు ఎలా దగ్గరగా ఉంటాయో అలాగే పార్సీల పేర్లు కూడా ముస్లిం పేర్లకు దగ్గరగా ఉంటాయని, ఫిరోజ్ జహంగీర్ గాంధీ పేరు ముస్లింపేరుకు దగ్గరగా ఉన్నందును బీజేపీ నేతలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. 1942 మార్చి 26 ఫిరోజ్ గాంధీ - ఇందిరా ప్రియదర్శినిల వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిందన్నారు. అప్పటినుండి ఇందిరా గాంధీ బ్రాహ్మణ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారని గుర్తుచేశారు.

Tags:    

Similar News