Railway Coaches Increase : రైల్వే కోచ్ ల సంఖ్య పెంచుతాం : అశ్వినీ వైష్ణవ్
ఛఠ్ పూజ, దీపావళి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలోఉంచుకొని రైల్వే కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 12,500 కోచ్‌లు అదనంగా జత చేసినట్లు శుక్రవారం తెలిపారు. 108 రైళ్లకు జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచినట్లు ప్రకటించారు. ‘‘2024–25లో పండగ వేళల్లో ఇప్పటివరకు మొత్తం 5,975 రైళ్లను నడపనున్నట్లు ఇప్పటికే ప్రకటించాం. కోటి మందికి పైగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందిలేకుండా తమ గమ్యస్థానాల్ని చేరుకొనేందుకు ఇది సాయపడుతుంది. 2023–-24లో మొత్తం 4,429 ప్రత్యేక రైళ్లను పండుగ సీజన్‌లో నడిపించాం’’ అని వైష్ణవ్ తెలిపారు. గణేష్ ఉత్సవాల కోసం 342 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపింది. ఇక ఈ ఏడాది జులైలో జగన్నాథ రథయాత్ర కోసం యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 300కుపైగా ప్రత్యేక రైళ్లను నడిపిన విషయం తెలిసిందే. మరోవైపు వందే భారత్ దాని కొత్త వెర్షన్లు, నమో భారత్, వందే భారత్ స్లీపర్ ట్రైన్లు త్వరలోనే రానున్నాయని వెల్లడించారు.