ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇవాళ సైతం భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలతో 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ తమ ఎయిర్‌లైన్ల నుంచి అప్ డేట్స్ తెలుసుకోవాలని సూచించింది. కాగా ఢిల్లీలోని కన్నౌట్ ప్యాలెస్, మథుర రోడ్డు, భారత్ మండపం సహా పలు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హిమాచల్‌ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.